ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అనూహ్యంగా 11 పాతవారిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనక బలమైన కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. 2019లో అధికారం చేపట్టిన సమయంలో మంత్రివర్గం ఏర్పాటు చేసిన సీఎం జగన్.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్టుగా తెలిపారు. పాతవారిలో ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారిని తొలగించనున్నట్టుగా చెప్పారు. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొంత ఆలస్యం అయింది. ఇక, ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. ప్రస్తుతం ఉన్న 24 మంత్రుల చేత రాజీనామాలు చేయించారు.
తర్వాత పాత మంత్రుల్లో ఇద్దరు, ముగ్గురికి మళ్లీ కొత్త మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం లభించనుందనే వార్తల నేపథ్యంలో.. ఆశావహుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే పాత మంత్రివర్గం నుంచి మరోసారి అవకాశం కల్పించే వారి సంఖ్య.. క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముగ్గురు, నలుగురు.. ఇలా అనూహ్యంగా 11కి చేరింది. దీంతో 14 మందిని మాత్రమే కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో కొందరు అశావహులకు తీవ్ర నిరాశే మిగిలింది.
అయితే అనుభవం, సామాజిక సమీకరణాలు, జిల్లాల అవసరాల దృష్ట్యా.. పాతవారిని మరోసారి మంత్రులుగా అవకాశం కల్పించినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ దీని వెనక అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు లభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలే.. ఈ అనూహ్య మార్పులకు కారణంగా చెబుతున్నారు. పీకే టీమ్ సూచించన విధంగానే.. పాత టీమ్‌లోని పలువురికి మరో అవకాశం దక్కినట్టుగా ప్రచారం జరుగుతుంది. పెద్ద మొత్తంలో సీనియర్లను మంత్రిపదవులను తొలగిస్తే.. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని, వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందని, క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని పీకే టీమ్.. జగన్‌కు సూచించినట్టుగా తెలుస్తోంది.
పాలనా పరంగా అనుభవం ఉన్న వారిని తప్పించి..కొత్త వారికి కీలక శాఖలు అప్పగిస్తే ప్రభుత్వం పరంగా నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని పీకే టీమ్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో పాతవారిలో కొందరిని కొనసాగించాలని పీకే జగన్‌కు సూచించినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ మేరకే సీఎం జగన్.. పెద్ద మొత్తంలో పాతవారిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పీకే టీమ్ సూచనలతో మంత్రివర్గ కూర్పులో అనుహ్య మార్పులు చోటుచేసుకున్నట్టుగా చర్చ జరుగుతుంది.
ఇక, జగన్ తొలి మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోమారు కేబినెట్‌లో అవకాశం కల్పించారు.
