Andhra Pradesh Minister Roja : శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను బుధవారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు.
Andhra Pradesh: శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఈ అంశం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమానికి రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను బుధవారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 48 క్రీడా విభాగాల్లో 1,670 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణను అందిస్తోంది. అయితే, మంత్రి రోజా కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ సభలో నాయకులు, అధికారులు బైరెడ్డి పేరే ఎత్తలేదు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అయన పేరును కూడా తీయలేదు. కాగా ఇప్పటికే బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే నాయకులు, అధికారులు బైరెడ్డి పేరు ఎత్తలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ప్రారంభించిన అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగవచ్చునని, 48 క్రీడా అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలుగులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ఆక్రమణలో ఉన్న క్రీడా ప్రాంగణాలు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని గత కొంత కాలండా రాష్ట్ర రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందిస్తూ.. పార్టీ మారే వార్తలను కొట్టిపారేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు. ‘‘నారా లోకేష్‌ను నేను కలిసినట్లు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు అందుకు తగ్గ ఆధారాలుంటే చూపించాలి. టీడీపీలో చేరే ప్రసక్తే లేదు’’ అని అన్నారు. మరోవైపు తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించకపోవడంపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించాడు. తన ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పాడు. ఎమ్మెల్యే ఆర్థర్ ప్రొటోకాల్, తన ప్రొటోకాల్ వేరని, అందువల్లే ఇద్దరూ కలవలేకపోతున్నట్లు చెప్పాడు. అయితే, ఇప్పుడు మంత్రి రోజా కార్యక్రమానికి దూరంగా ఉండటం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.
