ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇవాళ ఒక రోజు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చకు పట్టుపట్టిన టీడీపీ సభ్యులు తమ ఆందోళనలను ఇవాళ కూడా కొనసాగించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిరసనలు ఇవాళ కూడా కొనసాగాయి. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించినా వారు వినలేదు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మండిపడ్డారు. ఇలాంటి సభ్యులు ఉండటం తమ ఖర్మ అంటూ సీరియస్ అయ్యారు. సభను సజావుగా సాగనివ్వడం లేదని అన్నారు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ.. 11 మంది టీడీపీ సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు.

టీడీపీ శాసన సభ్యులు అచ్చెన్నాయుడు, రామ్మో హన్ రావు, సాంబశివ రావు, అశోక్, భవానీ, సత్యప్రసాద్, చిన రాజప్ప, రామకృష్ణమనాయుడు, రవికుమార్, వెంకట నాయుడు, జోగేశ్వర రావులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే చర్చ చేయాలని ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలను స్పీకర్ తమ్మినేని సీతారాం వారించారు. దయచేసి సభ్యులు తమకు కేటాయించిన సీట్లల్లో కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా టీడీపీ సభ్యులు ఖాతరు చేయలేదు. దీంతో ఆయన టీడీపీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు.

టీడీపీ సభ్యులు ఏది అడిగితే అది చేయడానికి కాదు.. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కనీసం ఫ్లోర్‌లో ఏం మాట్లాడాలో.. ఎలాంటి పదాలు వాడాలో కూడా తెలియదు అంటూ సీరియస్ అయ్యారు. మీరు శాసన సభ్యులుగా ఉండటం తమ ఖర్మ అంటూ ఫైర్ అయ్యారు. తాను కాబట్టే వారిని భరిస్తున్నానని, తనకు అనుభవం చేత టీడీపీ ఎమ్మెల్యేల తీరును భరిస్తున్నామని అన్నారు. ఇతరులైతే ఇది సాధ్యం కాకపోయి ఉండేదని తెలిపారు. అనంతరం, మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ద్వారా ఓటింగ్ జరిపి టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇదిలా ఉండగా, అసెంబ్లీలో TDP సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఏపీ సీఎం YS Jagan నిన్న సూచించారు. Jangareddy Gudem మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ సభ్యులు గొడవ చేస్తుండడంతో ఈ విషయమై సీఎం జగన్ మంగళవారం నాడు జోక్యం చేసుకొన్నారు.

సభలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఎవరైనా సారా తయారు చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. 

ఏదో మారుమూల గ్రామాల్లో సారా తయారు చేస్తారంటే నమ్మొచ్చు కానీ మున్సిపాలిటీలో సారా తయారు చేస్తారంటే ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. 

నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాటుసారా తయారీ సాధ్యమా అని జగన్ అడిగారు. నాటు సారా కాసే వాళ్ల మీద తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. నాటు సారా కాసే వాళ్లపై ఇప్పటికే 13 వేల మంది కేసులు నమోదు చేశామని సీఎం జగన్ వివరించారు.