AP Election: ఏపీలో ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ పరిణామం తమకే  అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే.. తామే కచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి బలంగా విశ్వసిస్తుంది. ఇలా ఇరు పార్టీల వాదన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందనే దానేది చర్చనీయంశంగా మారింది

AP Election: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. సోమవారం నాడు జరిగిన ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇలా అర్ధరాత్రి 12 దాటినా కొన్ని చోట్ల పోలింగ్‌ జరిగింది. ఏపీ ఎన్నికల కమిషన్‌ అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 వరకు దాదాపుగా 78.36 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు వెల్లడించింది. కానీ.. ఈసారి మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపడుతున్నాయి

ఈ నేపధ్యంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందనే దానేది చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే పలు మీడియా సంస్థలు, టీవీ ఛానెళ్లు, రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల సమరంలో గెలుపెవరిది? పై చేయి ఎవరు సాధిస్తారు? ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇంతకీ పోలింగ్ శాతం పెరిగితే.. ఎవరికి లాభం..? 

రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరగడం తమకే అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే.. తామే కచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి బలంగా విశ్వసిస్తుంది. వాస్తవానికి పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు వినిపిస్తాయి. గత ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు ఇచ్చాయి. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నరనీ, అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లోనూ అదే పరిస్థితి జరిగింది. గణాంకాల పరంగా పరిశీలిస్తే.. 2014లో ఏపీలో పోలింగ్ 77.96 శాతం నమోదు కాగా.. 2019 ఎన్నికల్లో పోలింగ్ 79.64 శాతం నమోదైంది. ఈ సారి దాదాపు 78.36 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు తెలుస్తోంది. కానీ.. ఈసారి మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపడుతున్నాయి. ఇలా ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో అధికారిక వైసీపీ పై వ్యతిరేకత కారణంగానే ఓటర్లు పోటెత్తారని, గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అంటున్నారు.

చైతన్యమా? మార్పు కోరుకున్నారా? 

ఏపీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందులాగా.. అదికార పార్టీ వైసీపీపై అంత వ్యతిరేకత వినిపించలేదు. అధికార పార్టీపై కూడా మౌత్ టాక్ బాగానే ఉందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనీ, ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం అమలు అవుతున్నా.. సంక్షేమపథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని, ఈ క్రమంలోనే గ్రామీణప్రాంతాలలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైనట్టు వాదన అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు..ఓటర్లలో చైతన్యం వచ్చిందనీ, స్వచ్చందంగా ఓటింగ్ వేయడానికి వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు.. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని, తెలంగాణలో లాగా ఏపీలో కూడా అధికార మార్పు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

ఏదిఏమైనా.. తాము మరోసారి అధికారంలోకి వస్తామనీ, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు అనుకూలమని వైసీపీ వాదిస్తుంటే.. మరోవైపు కూటమి మరో రకంగా వాదిస్తుంది. గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే ఓటర్ దేవుళ్లు ఎవరికి కరుణించారనేది తేలాలంటే జూన్ 4 న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..