జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులపై గతేడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఈ నివేదిక తయారు చేశారు. దేశం మొత్తం మీద 4,068 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు నమోదయ్యాయి. 

ఈ నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏపీ పోలీసులపై  నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు తెలిపింది. 

‘రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలవుతోందా?’ అంటూ రాష్ట్ర హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తున్న సమయంలో ఈ నివేదిక వెలువడడం గమనార్హం. ఏపీ పోలీసులపై 2019లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు, అరెస్టులు, అభియోగపత్రాలపై అందిన వివరాలతో ఇది తయారైంది. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో వరకట్న వేధింపుల మొదలుకొని లాకప్‌ డెత్‌ల వరకూ ఎన్నో రకాల కేసులు నమోదయ్యాయి.  

కాగా, రాష్ట్ర పోలీసులపై  నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. వీటిలో కోర్టుల్లో విచారణ పూర్తి అయినవి ఎనిమిది కాగా, అన్నింట్లోనూ సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో విచారణ దాకా రాకముందే ఫిర్యాదుదారులు ఉపసంహరించుకొన్నారు.

ఇన్ని కేసుల్లో ఇప్పటిదాకా పోలీసుల అరెస్టులు జరిగింది కేవలం 85 కేసుల్లోనే.. ఇది తమవారిపై దర్యాప్తు అధికారులకున్న ప్రేమకు నిదర్శనమని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు ఆక్షేపిస్తున్నారు.