Asianet News TeluguAsianet News Telugu

కన్న కూతురికి తండ్రి సెల్యూట్..!

తిరుపతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన కంటే పెద్ద స్థాయిలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
 

Andhra Cop Salutes Officer Daughter, Viral Photo Wins Hearts
Author
Hyderabad, First Published Jan 6, 2021, 11:10 AM IST

కంటి రెప్పలా చూసుకుంటూ.. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. మన కళ్లముందే ఎదిగి పెద్దవాళ్లు అవ్వడమేకాకుండా.. ఉన్నత స్థాయికి చేరుకుంటే.. ఆ తల్లిదండ్రులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ఉన్నత స్థాయిలో ఎదిగిన బిడ్డను చూసుకొని ఆ తల్లిదండ్రులు మురిసిపోతుంటారు.  కాగా.. ఇలాంటి పుత్రికోత్సాహమే ఓ వ్యక్తికి కలిగింది.

తన కూతురు ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా.. తనకు బాస్ గా మారింది. డీఎస్పీ స్థాయిలో ఉన్న కూతురిని.. సీఐగా ఉన్న తండ్రి అందరి ముందూ సెల్యూట్ చేయడం.. అందరినీ ఆకట్టుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీస్ శాఖ మొట్టమొదటి సారిగా ‘పోలీస్ డ్యూటీ మీట్ 2021’ను ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన కంటే పెద్ద స్థాయిలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

2018 బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి.. గుంటూరు అర్బన్ సౌత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా ‘దిశ’ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి కళ్యాణి డ్యామ్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ (సీఐ)‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంతి తండ్రి శ్యామ్ సుందర్ కూడా వచ్చారు.

పోలీస్ డ్యూటీ మీట్‌లో తన కంటే పెద్ద స్థాయిలో విధుల్లో ఉన్న తన కూతురిని చూస్తూ శ్యామ్ సుందర్ మురిసిపోయారు. గుండెల మీద ఎత్తుకుని పెంచుకున్న బిడ్డ.. తన కంటే పెద్ద ర్యాంక్‌లో తన కంటి ముందే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, డ్యూటీ చేస్తుండటాన్ని దూరం నుంచే చూస్తూ ఆనందం పడ్డారు. తర్వాత దగ్గరకెళ్లి ‘నమస్తే మేడం’ అంటూ సెల్యూట్ చేశారు. ప్రశాంతి కూడా వెంటనే సెల్యూట్ చేసిన తర్వాత తండ్రిని చూసి.. ఏంటి నాన్నా, అంటూ గట్టిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios