ఏడాది పాలన: త్వరలోనే జగన్ పల్లెబాట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే గ్రామాల బాట పట్టనున్నారు. ఏడాది కాలం పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో అమలు జరుగుతున్న తీరు తెన్నులను స్వయంగా పరిశీలించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే గ్రామాల బాట పట్టనున్నారు. ఏడాది కాలం పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో అమలు జరుగుతున్న తీరు తెన్నులను స్వయంగా పరిశీలించనున్నారు.
2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి చేసుకొన్నారు. ఏడాది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దాదాపుగా అమలు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇంకా కొన్ని హామీలను అమలు చేయనున్నారు.
మేనిఫెస్టోలో లేని వాటిని కూడ కొన్నింటిని అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సీఎం ఆదేశించారు.అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే అధికారులపై చర్యలు తీసుకొంటామని గతంలోనే సీఎం హెచ్చరించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటిన తర్వాత గ్రామాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జగన్ గ్రామాల బాట పట్టనున్నారు.
తన పాలనపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకొనేందుకు జగన్ గ్రామాలకు వెళ్లనున్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని జగన్ ప్రకటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండే సీఎం జగన్ గ్రామాల బాట పట్టాలని భావించారు. కానీ కొన్ని కారణాలతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి.కరోనా సమయంలో గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదు.. కరోనా తగ్గిన తర్వాత గ్రామాల్లో పర్యటించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.
జగన్ కూడ వైఎస్ రచ్చబండ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకొంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేవో తెలుసుకొంటారు.