అక్రమార్కుల చుట్టూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఉచ్చు బిగిస్తోంది. అక్రమాస్తులను పోగేస్తున్న వారి విషయంలో మామూలుగా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తే ఉపయోగం లేదని అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు అక్రమార్కులు రెచ్చిపోతుండటం, ఇంకోవైపు అక్రమసంపాదన వందల కోట్లు దాటిపోతుండటంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, ఈ కేసుల్లో పట్టుబడ్డ వారంతా అక్రమసంపాదనాపరులే అని నిరూపించటం ఏసిబికి చాలా కష్టంగా ఉంటోంది. ఒక్కో కేసు సంవత్సరాల తరబడి సాగుతుండటంతో సాక్ష్యాలు కూడా నిలవటం లేదు. ఈ పరిస్ధితులను అవకాశంగా తీసుకునే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్నది అందరికీ తెలిసిందే.

ప్రతీ సంవత్సరం ఏసిబికి పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. 2014-17 మధ్య 132 మంది ఏసిబికి పట్టుబడ్డారు. తక్కువలో తక్కువ వారి ఆస్తుల విలువ ఎంతలేదన్నామార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 3 వేల కోట్లుంటుంది. పట్టుబడ్డ అక్రమాస్తుల సంపాదన అవినీతి వల్లే సాధ్యమైందని నిరూపించాలంటే ఏసిబి వల్ల కానీపని. అందుకే అటువంటి వ్యవహారాలన్నీ ఇడికి అప్పగించాలని యోచిస్తోంది. ఇదే విషయమై శుక్రవారం ఇడి-ఏసిబి ఉన్నతాధికారుల సమావేశం జరగబోతోంది.

ఇదే విషయమై ఏసిబి డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ, ఏసిబి కేసుల్లో పట్టబడ్డ వారి వ్యవహారాలను ఇడికి అప్పగించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. రూ. 30 లక్షలకు పైగా ఆస్తులతో పట్టుబడ్డ వారి కేసులన్నింటినీ ఇడికి అప్పగిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మామూలుగా అయితే ఏసిబి కేసుల్లో పట్టుబడిన వారిది అక్రమ సంపాదనే అని నిరూపించాల్సిన బాధ్యత తమదే అన్నారు. అదే ఇడికి కేసులను బదాలాయిస్తే ఇడి చట్టం ప్రకారం తమ సంపాదన సక్రమమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పట్టుపడ్డవారిదే అని చెప్పారు. పట్టుబడ్డ వారి విషయంలో మనీలాండరింగ్ కోణం కూడా వెలుగు చూస్తుండటంతో కీలకమైన కేసులను ఇడికి అప్పగించాలని ఏసిబి ఆలోచిస్తోందని ఠాకూర్ చెప్పారు.