అనంతపురం జిల్లాలో ఓ  గ్రామస్తులు ఊరు విడిచి పెట్టారు. ఊరు ఊరంతా ఖాళీ చేసి పెంపుడు జంతువులతో సహా గ్రామశివార్లలో మకాం వేశారు. ఇదేంటీ అని అడిగితే పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అంటూ చెప్పుకొచ్చారు. వినడానికి విచిత్రంగా ఉన్నా వారి ఆచారాలు, నమ్మకాలు ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషం. 

ఈ సంఘటన అనంతపురం జిల్లా, కుందుర్పి మండలంలోని శ్రీ మజ్జనపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ ప్రతి ఐదేళ్లకోసారి ఊరంతా ఖాళీ చేయడం వీరికి అనవాయితీగా వస్తోంది. ఈ గ్రామస్తులు దశాబ్దాలుగా పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ ఊరు బాగు కోసం గ్రామదేవతలను వేడుకుంటూ గ్రామం వదిలి గ్రామ శివారు పొలాల్లో చెట్ల కింద గుడారాలు వేసుకుంటారు. 

ఒక రోజంతా అంటే 24 గంటల పాటు అక్కడే వంటా, వార్పు చేసుకునే సాంప్రదాయం పాటిస్తారు. అంతేకాదు గ్రామం చుట్టూ ముళ్లకంచెలు వేస్తారు. దేవుడి విగ్రహాలు, పెంపుడు జంతువులతో రోజంతా అక్కడే ఉంటారు. ఈ ఆచారం వెనుక గ్రామ పెద్దలు చెప్పే సుదీర్ఘ కథనం ఉంది. 

వందేళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారట. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్కరాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులుగా ఉన్న పూజారి పాలయ్య, ఓబయ్య, హనుమయ్యలకు కలలో కనిపించి, 24 గంటలపాటు అందరూ గ్రామాన్ని వదిలి ఉంటే ఊరు సుభిక్షంగా ఉంటుందని చెప్పారట. 

అప్పటినుంచి ఈ ఆచారం పుట్టుకొచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. అలా అప్పటి నుంచి ఐదేళ్లకోసారి ఇలా ఊరు విడిచి పెట్టడం అనవాయితీగా నేటికీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ రెండు గ్రామాల్లో నేటికి కోడి మాంసం, కోడి గుడ్డు ముట్టరు. ఇది కూడా దేవతల సంప్రదాయంగా ఆచరిస్తుండడం మరో విశేషం.