చంద్రబాబుకు డెడ్‌లైన్: జేసీ రాజీనామా యోచన

Anantapur MP JC Diwakar Reddy plans to resigned to TDP
Highlights

ఈ నెల 25వ తేదీలోపుగా తన డిమాండ్లు నెరవేర్చకపోతే పార్టీకి రాజీనామా చేయనున్నట్టు  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 


అనంతపురం: ఈ నెల 25వ తేదీలోపుగా తన డిమాండ్లు నెరవేర్చకపోతే పార్టీకి రాజీనామా చేయనున్నట్టు  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 

మాజీ మంత్రి, అనంతపురం ఎంపీ   టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు షాకిచ్చారు. టీడీపీ అధిష్టానం ఎంపీలను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీలో  తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అవసరమైతే పార్టీకి కూడ రాజీనామా చేయనున్నట్టు  జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.

అనంతపురం పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిధుల మంజూరు చేయలేదని  జేసీ కినుక వహించారు. మరోవైపు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తాను టీడీపీలోకి తీసుకురావాలని  జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నాలు  చేస్తున్నారు.

మధుసూధన్ గుప్తాతో పాటు గుంతకల్లు నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి పర్యటించడాన్ని స్థానిక ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. మధుసూధన్ గుప్తాను పార్టీలోకి తీసుకురావడాన్ని జితేందర్ గౌడ్ అడ్డుకొంటున్నారు.

అంతేకాదు అనంతపురం పట్టణంలో కూడ స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి  జేసీ దివాకర్ రెడ్డి మధ్య విబేధాలున్నాయి. అనంతపురం పట్టణంలో అభివృద్ధి విషయమై వీరిద్దరి మధ్య వివాదాలు సాగుతున్నాయి.

అయితే ఈ వివాదాల నేపథ్యంలో   ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకొంటున్నారు. మరోవైపు  అనంతపురం మాజీ ఎమ్మెల్యే  గుర్నాథరెడ్డిని టీడీపీలోకి తీసుకోవడాన్ని కూడ ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ప్రభాకర్ చౌదరిని చేర్చుకోవడంలో  జేసీ దివాకర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. 

కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం ప్రతిపాదించిన తరుణంలో  జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకుండా అనంతపురంలోనే ఉన్నారు.అయితే  కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించిన  బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేనందున తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం ఉండదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

అయితే  జేసీ దివాకర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఎంపీలు, పార్టీ నేతలు పార్లమెంట్ సమావేశాలకు జేసీని హజరయ్యేలా  చొరవ తీసుకొంటున్నారు. అయితే  టీ కప్పులో తుఫాను మాదిరిగా  ఈ వివాదం ముగిసిపోయే అవకాశం ఉంటుందని టీడీపీ నాయకత్వం అబిప్రాయంతో ఉంది.

ఇదిలా ఉంటే గతంలో కూడ తన నియోజకవర్గం పరిధిలో సాగు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ పదవికి జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఈ విషయమై ఆ సమయంలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నారు.  ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు  జేసితో చర్చించి  ఆయన డిమాండ్ మేరకు  ఆయన నియోజకవర్గంలోని కాలువలకు నీటిని విడుదల చేయించారు.దీంతో జేసీ దివాకర్ రెడ్డి  తన రాజీనామాను ఉపసంహరించుకొన్నారు.

అయితే తాజాగా కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం ప్రతిపాదించిన సమయంలోనే ఆ పార్టీ ఎంపీయే పార్లమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

మరో వైపు టీడీపీ ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. జేసీ దివాకర్ రెడ్డి  పార్టీ విప్ ను ధిక్కరిస్తారా.. లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే తన డిమాండ్లను ఈ నెల 25వ తేదీలోపుగా నెరవేర్చకపోతే టీడీపీకి రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడం ప్రస్తుతం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.

loader