ఇంతమంది ఆశావహుల్లో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో, మిగిలిన వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
అనంతపురం జిల్లాలో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది త్వరలో. స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నిక అందుకు వేదిక అవుతోంది. ప్రస్తుతం ప్రస్తుత ఎంఎల్సీ మెట్టు గోవిందరెడ్డి పదవీ కాలం మార్చిలో అయిపోతోంది. దాంతో ఆ స్ధానాన్ని ఆశిస్తూ పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు టిక్కెట్టు తమకే కావాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెడుతుండటంతో తలనొప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని గ్రూపుల పుణ్యమా అంటూ పలువురు నేతలు రోడ్డెక్కి మరీ రచ్చ చేస్తున్నారు. ఇపుడీ ఎన్నిక కారణంగా గ్రూపు తగాదాలు మరింత పెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది.
పోయిన ఎన్నికల్లో హిందుపురం ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ నందమూరి బాలకృష్ణ కోసం టిక్కెట్టును త్యాగం చేసారు. కాబట్టి ఎంఎల్సీ టిక్కెట్టు తనకే ఇవ్వాలంటూ బాలకృష్ణ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. తాడిపత్రికి చెందిన ఫయాజ్ భాషా కూడా రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో తనకు సీటు కేటాయించాల్సిందేనంటూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పరిటాల రవికి ప్రధాన అనుచరుడైన గడ్డం సుబ్బు కోసం మంత్రి పరిటాలసునీత పట్టుబట్టారు.
వీరికి అదనంగా జెసి బ్రదర్స్ కూడా రంగంలోకి దిగారు. తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి అల్లుడైన దీపక్ రెడ్డి కోసం జెసి సోదరులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి అసలే రాయలసీమ రెడ్ల తరపున వకాల్తా పుచ్చుకున్నానని చెబుతుంటారు. పైగా జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టటానికి ఎంపిని చంద్రబాబు కూడా బాగా వాడుకుంటున్నారు. మరి తమ అల్లుడికి సీటు ఇవ్వకపోతే జగన్ మీద కోపాన్ని జెసి బ్రదర్స్ చంద్రబాబు మీద చూపినా చూపుతారు. కాకపోతే జెసి ఇంట ఇప్పటికే రెండు పదవులుండగా మూడో పదవి ఇస్తారా అన్నదే సందేహం. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్న నేపధ్యంలోనే మళ్లీ తనకే మరో అవకాశం ఇవ్వాలంటూ మెట్టు గోవిందరెడ్డి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇంతమంది ఆశావహుల్లో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో, మిగిలిన వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
