అనంతపురం:ఇంట్లో కూర్చొని దీక్షలు చేస్తే సీఎం జగన్ స్పందిస్తారా అని  అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  పరోక్షంగా టీడీపీ నేతలను ప్రశ్నించారు.

గురువారం నాడు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో 158 రోజుల పాటు దీక్షలు చేస్తే ఒక్కరైనా స్పందించారా అని ఆయన అడిగారు.

also read:అధిక విద్యుత్ ఛార్జీల వసూళ్లు... ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

వైసీపీ వాళ్లదే రాజ్యం కాబట్టి టీడీపీపై దాడులు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఏం చూస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలని సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని జేసీ దివాకర్ రెడ్డి సమర్ధించారు.

also read:ఏపీలో మాస్కులతో విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు: వీరికి మినహాయింపులు....

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ టీడీపీ నేతలు దీక్షలకు దిగారు. ఈ దీక్షలపై ఆయన స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డితో కొంత కాలం క్రితం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. అయితే పాత మిత్రుడు కావడం వల్లే ఆయనతో సమావేశమైనట్టుగా చెప్పారు. ఈ భేటీలో రాజకీయాలపై చర్చ జరగలేదని చెప్పారు.