కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందు అందించిన ఆనందయ్య త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. అన్ని కులాలను కలుపుకుని కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రథయాత్ర చేయనున్నట్టూ తెలిసింది.
అమరావతి: కరోనా(Corona) సెకండ్ వేవ్ సమయంలో ఆయుర్వేదం(Ayurveda) మందు అందించిన ఆనందయ్య(Anandaiah) తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడయ్యాడు. ఆయన త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నారు. కొత్త రాజకీయ పార్టీ(Political Party) పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలనూ రచించుకున్నట్టు తెలిసింది. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, క్యాడర్, కార్యకర్తల సమీకరణకూ ప్లాన్‌లు వేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రథయాత్ర చేయనున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. జాతీయ నేతల అండదండలతో బలహీన, అణగారిన వర్గాలను కలుపుకుని వెళ్లాలని సన్నద్ధమవుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్‌లో ఆనందయ్య ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందింది. ఆయన మందు మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఆయన మందుకు ప్రాధాన్యత పెరిగింది. ఆనందయ్య కూడా ఇరు రాష్ట్రాల్లో జనాదరణ సంపాదించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని ఆయన కొన్ని సార్లు వ్యక్తం చేశారు. అయినప్పటికీ 13 జిల్లాల్లో ఆయుర్వేదం మందును పంపిణీ చేశారు. ఆయన స్వయంగా మందును తయారుచేశారు. తన అనుచరులు మందు పంపిణీలో కృషి చేశారు. మందుపై నిపుణుల పరీక్షలూ జరిపారు. కానీ, వ్యక్తిగతంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలకే పెద్దపీట వేస్తూ చాలా మంది మందుపై సానుకూలంగా వ్యవహరించారు. తెలుగురాష్ట్రాలే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలూ ఈ మందును తీసుకోవడానికి ఆసక్తి చూపించారు.
