ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. నాడు నరకాసురుడు ప్రజలను హింసిస్తే నేడు నారా సురుడు బాధిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు.  

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. నాడు నరకాసురుడు ప్రజలను హింసిస్తే నేడు నారా సురుడు బాధిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. 

రాష్ట్రంలో చంద్రబాబు పాలన నరకాసురుడి పాలనను తలపిస్తోందన్నారు. బెల్ట్‌ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 

2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్‌, తిత్లీ తుఫాన్‌లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు. తుఫాన్‌ బాధితులకు ఏదో సాయం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

నాలుగున్నరేళ్లకాలంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయని ఆనం విమర్శించారు. ఆపరేషన్‌ గరుడ అంటున్న సినీనటుడు శివాజీని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. పోలీస్‌ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్‌ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు. 

యూపీఎలో చంద్రబాబు కొత్తగా కూడగట్టేదేముందన్నారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యవస్థను కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఒకటిన్నర లక్షల కోట్ల అ‍ప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు.