నెల్లూరు జిల్లా విభజనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇది అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ జిల్లా పునర్విభజనకు సంబంధించి పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా విభజనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇది అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ఆనం మాటలకు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా రాంకుమార్ రెడ్డిపై ఆనం మరోసారి పైర్ అయ్యారు. దీంతో నెల్లూరు జిల్లా విభజన అధికార పార్టీలో అంతర్గత పోరు మరోసారి బయటపడింది.
అసలేం జరిగిందంటే.. విభజనతో సోమశిల ప్రాజెక్ట్ నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆనం అన్నారు. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలని.. పాలనాపరమైన అంశాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్నారు.డీలిమిటేషన్ విషయంలో హడావుడి నిర్ణయాలతో విద్వేషాలు పెరుగుతాయని.. విభజనపై అవగాహన సదస్సులు నిర్వహించాలి ఆనం డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని ఆయన కోరారు.
అయితే ఆనం వ్యాఖ్యలకు వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (nedurumalli ramkumar reddy ) కౌంటరిచ్చారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ లేదంటూ దుయ్యబట్టారు. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు వ్యతిరేకంగా లేరని.. ఎమ్మెల్యేగా రాపూర్‌కి ఆనం ఏం చేశారో చెప్పాలని రాంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆనం ఫ్యామిలీని తొక్కాలనుకుంటే.. జనార్థన్ రెడ్డి ఎప్పుడో పక్కన పెట్టేవారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాపూరు, కలువాయి వాసులు కూడా మంచి రోజులు వచ్చాయంటున్నారని చెప్పుకొచ్చారు. కొందరు స్వార్ధ రాజకీయాలు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేగా దీక్ష చేయడం సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిపై పదే పదే ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని చెప్పడం ఏమిటని మండిపడ్డారు.
అయితే నేదురుమల్లి రాంకుమార్‌పై ఆనం చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంకటగిరిలో తనకు సెంటు భూమి కూడా లేదని చెప్పారు. వెంకటగిరి నియోజవర్గాన్ని విభజించి పాలించాల్సిన అవరసం లేదన్నారు. జిల్లాల పునర్విభజనపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే.. అది వాళ్ల విజ్ఞతకే వదిస్తున్నానని చెప్పారు. ఎవరేదో మాట్లాడితే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన స్థాయి తనదికాదని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
