అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి  విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి పంచాలనే 3 రాజధానుల పేరుతో నాటకం ఆడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అంతేగానీ మూడు రాజధానుల నిర్ణయం రాష్ర్ట అభివృద్ది కోసం మాత్రం కాదన్నారు. జగన్ తన స్వార్ధం కోసం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి భవిష్యత్ తరాలకు తీరని  ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 

''దేశంలోని ఏ రాష్ట్రానికైనా రాజధాని అనుకూలంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. కానీ నేడు జగన్ వ్యవహారశైలి వల్ల రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని అనుకూలంగా లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి?'' అని ప్రశ్నించారు.

''ఏడాదిన్నర వైసీపీ పాలనలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో సమాధానం చెప్పాలి? కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా? రాజధాని  అనేది పెట్టుబడులు ఆకర్షించేలా ఉండాలని, మంచి రాజధాని ఉంటేనే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని  జగన్ గతంలో అన్నారు. కానీ  ఇప్పుడు అసలు రాజధాని లేకుండా చేసి రాష్ట్రం వెన్ను విరిచారు'' అని అన్నారు. 

read more    మహిళలకు ఆర్ధిక స్వావలంభన: వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించిన జగన్

''విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్ తో 5 ఏళ్లలో అన్ని విధాల అభివృద్ది చేశారు. జగన్ ఏడాదిన్నర పాలనలోనే అన్ని వ్యవస్ధలను ద్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ ని అప్పులాంధ్రప్రదేశ్ మార్చారు.  ఓ వైపు ప్రభుత్వానికి ఆదాయం లేదు, మరో వైపు రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు. జగన్ వ్యవహార శైలితో రాష్ర్ట భవిష్యత్ ప్రశ్నార్ధంగా మారింది'' అని మండిపడ్డారు. 

''చంద్రబాబు నాయుడు అమరావతికి అంతర్జాతీయ బ్రాండ్ క్రియేట్ చేసి వేల కోట్లు పెట్టుబడులు,అనేక పరిశ్రమలు తెచ్చారు. కానీ జగన్ అమరావతి బ్రాండ్ ని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ని అగాధంలోకి నెట్టారు'' అని అనగాని విరుచుకుపడ్డారు.