అమరావతి: మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించడం కోసం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

వైఎస్ఆర్ చేయూత పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు అమరావతిలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా 18,750 రూపాయలు చొప్పున నాలుగేళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని  సుమారు 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4700 కోట్లు కేటాయించింది.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వ సహకారంతో స్వంత కాళ్ల మీద నిలబడాలనుకొనేవారికి ఈ పథకం ద్వారా చేయూత అందనుందన్నారు.

మహిళలకు శిక్షణ, సాంకేతిక, మార్కెటింగ్ వంటి అంశాల్లో పెద్ద పెద్ద సంస్థలు సహాయం అందించనున్నాయని సీఎం చెప్పారు. మహిళలకు ఆర్ధిక స్వావంభనను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు.పాదయాత్ర సందర్భంగా ఈ విషయాన్ని ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడ ఈ అంశాన్ని చేర్చినట్టు ఆయన చెప్పారు. 

ప్రభుత్వ పెన్షన్ తీసుకొంటున్న మహిళలకు కూడ ఈ పథకంలో అవకాశం కల్పిస్తామన్నారు సీఎం.ఈ డబ్బుతో స్వయం ఉపాధి అవకాశాల కోసం ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు కొన్ని కంపెనీలు శిక్షణ ఇస్తాయని ఆయన చెప్పారు. 

ఈ పథకంలో ఎవరి పేరు లేకపోతే గ్రామ సచివాలయంలోని వాలంటర్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. అర్హులైన వారికి ఈ పథకం వర్తింపజేయనున్నట్టుగా ఆయన చెప్పారు.