అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం దుర్మర్గమంటూ వైసిసి ప్రభుత్వంపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజాబిపాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకుని అమరావతి నే రాజధాని గా కొనసాగించాలని కోరిన రైతులపై అక్రమ కేసులు పెడతారా? అని నిలదీశారు.  దేశంలోని  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ప్రోత్సహించి సన్మానాలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులు పెట్టి సంకెళ్లు వేస్తోందని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''రైతులు  చేసిన నేరం.ద్రోహం ఏమిటి?రైతు లేమన్న  దొంగలు.దోపిడీ దారులా?వారేమన్నా ఆర్ధిక ఉగ్రవాదులా?వారేమన్నా సీబీఐ నిగ్గు తేల్చిన రూ 43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీలో నిందితులా ? వారిపై అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? అమరావతి కోసం 322 రోజుల నుంచి రైతులు  ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పదించటంలేదు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?'' అని నిలదీశారు. 

''3 రాజధానులను ప్రజలు వ్యతిరేకించటంతో వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ దీక్షలు చేయించడం సిగ్గుచేటు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులిస్తూ, డైరెక్షన్ ఇస్తూ వీడియోల ద్వారా పట్టుబడ్డా వైసీపీ నేతల తీరు మాత్రం మారకపోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలి'' అని సూచించారు. 

''ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదు, ఎన్ని కుట్రలు చేసినా రాజధాని ని మార్చడం సాధ్యం కాదు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి ముఖ్యమంత్రి  రైతులకు క్షమాపణ చెప్పాలి'' అని అనగాని డిమాండ్ చేశారు.