ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోనే ఉన్నది: కేంద్రం
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే విషయంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ హైకోర్టు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉన్నదని వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు తరలింపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని వివరించారు. ఈ హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే అందుకు హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోనే ఉన్నదని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా హైదరాబాద్ హైకోర్టు ఉండేదని, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టును ఏర్పాటు చేసినట్టు వివరించారు.
Also Read: పసికందు ఆకలి తీర్చిన మంత్రి హరీశ్.. పాల కొరత తీర్చడానికి ఆవునే కొనిచ్చిన మంత్రి
ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని వివరించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు కూడా ఫైల్ అయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు వాటి అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉన్నదని వివరించారు.