తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత యాత్ర ఫ్లాప్ అయిందని విమర్శించారు.

తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత యాత్ర ఫ్లాప్ అయిందని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్‌తో పవన్‌కు ఇప్పుడు అర్థమైందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటించిన తర్వాత చేపట్టిన వారాహి నాలుగో విడత యాత్ర ఫ్లాప్‌ అయ్యిందని విమర్శలు గుప్పించారు. 

కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్‌ సభలు పెడుతున్నారని.. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్స్ అని విమర్శలు చేశారు. పవన్‌ సభలకు టీడీపీ శ్రేణులు వెళ్లాలని లోకేష్, అచ్చెన్నాయుడు కోరారని.. అయితే సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్‌ సభకు రాలేదని అన్నారు. దీంతో నాగబాబు, నాదెండ్ల మనోహన్ జనాల తరలింపుకు ఫోన్లు చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో పవన్ పొత్తును ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు.

పవన్ బీజేపీతో ఉన్నానని అంటున్నారని.. టీడీపీతో వెళ్తానని కూడా అంటాడని.. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ బీజేపీతో ఉన్నాడా? లేడా? అనేది జనసైనికులకు క్లారిటీ ఇవ్వాలని అన్నారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తర్వాత పవన్‌ బాడీలాంగ్వేజ్‌ మారిపోయిందని విమర్శించారు. సర్వనాశనం అయిపోయిన టీడీపీని పవన్ కల్యాణ్ బతికించాలని అనుకుంటున్నాడని అన్నారు. చంద్రబాబు చెప్పులు మోసేందుకు కూడా సిగ్గుపడని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. 

టీడీపీ చేపట్టిన దీక్షలపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబు గాంధీ జయంతి రోజున నిరాహార దీక్ష చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. దీంతో గాంధీజీ ఆత్మ కూడా క్షోభిస్తుందని అన్నారు.