గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

గుంటూరు: గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. 

యరపతినేని శ్రీనివాస్‌ ఆగడాలకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్‌ బాబుకు కప్పం కడుతూ మైనింగ్‌ పేరుతో శ్రీనివాస్‌ అందినంత దోచుకుంటున్నారని ఆయన అన్నారు. గురజాలలో ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

పవిత్రమైన పల్నాడులో గంజాయి, నాటు సారా ఏరులై పారుతోందని గురజాల వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. మైనర్‌ బాలికపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. 

మైనింగ్‌ అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేనిపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని మహేష్‌ రెడ్డి సవాల్‌ చేశారు.