గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఆయనకంటూ ఓ గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాంచి నోరున్న నేత. తన మాటల తూటాలతో అధికార పార్టీపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి. తమ్మిన బమ్మిని చేసేంతగా పదునైన మాటలతో ఇతర పార్టీలపై విరుచుకుపడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 

అంతలా విరుచుకుపడే రాంబాబుపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంబటి పేరెత్తుతుంటే చాలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఆయన మాకొద్దు మెుర్రో అంటూ మెుత్తుకుంటున్నారు. 

అంబటి రాంబాబు సొంతఇలాకాలో నెలకొన్న అసమ్మతి సెగ ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత కొంతకాలంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. సొంత గూటిసభ్యులే అంబటికి విపక్ష సభ్యుల్లా మారారు. అంబటి రాంబాబును తాము బరాయించలేమంటూ సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు అసమ్మతి గళం విప్పారు. 

అంబటి తమకొద్దంటూ బహిరంగంగా విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి అసమ్మతి నేతలంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ జెడ్పిటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు మాజీ సర్పంచ్ లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

అంబటి వ్యతిరేకులంతా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను కలుపుకుపోకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారంటూ దుయ్యబుట్టారు. అంబటి నాయకత్వంపై తాము పలుసార్లు జగన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబును మార్చాలంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామరి హెచ్చరించారు. అంబటి నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 

పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు చేసిన పొరపాట్ల వల్లనే గతంలో వైసీపీ ఓటమిపాలైందని ఆరోపించారు. పొరపాట్లు గురించి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పద్దతి మార్చుకోకుండా మరిన్ని పొరపాట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంబటిని మార్చి మంచి సమన్వయకర్తను నియమించాలని జగన్ ను కోరతామని తెలిపారు. 2014 ఎన్నికల్లో అంబటి స్వయంకృతారాధం వల్లే ఓటమి పాలయ్యామని ఆరోపించారు. కౌన్సిలర్‌గా కూడా గెలవలేని రాంబాబుకు పార్టీ ప్రాధాన్యత ఇస్తే పనిచేసే కార్యకర్తలను పట్టించుకోవటంలేదన్నారు. అధిష్ఠాన వర్గం కార్యకర్తల మనోభావాలను గుర్తించి సమన్వయకర్తను మార్చాలని కోరారు.