అమరావతి: బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు ఒక్కటే కావడం ఆసక్తికరమైన విషయం. అమరావతి భూసేకరణ విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా రెండు పార్టీలు ఒకే రకమైన హామీలను ఇచ్చాయి. గత చంద్రబాబు ప్రభుత్వం ఎపి రాజధాని అమరావతి కోసం చేసిన భూసేకరణ విషయంలో రెండు పార్టీలు కూడా ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నాయి. 

ఎపి రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై ఆ రెండు పార్టీలు ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఆ రెండు పార్టీలు కూడా ఒకే విధానంతో ఉన్నట్లు కనిపిస్తోంది. 

రాజధాని కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే విషయం బిజెపి ఎన్నికల ప్రణాళికలో కూడా ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్ ఆ విషయంపై మాట్లాడారు. రాజధాని ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి ఇష్టపడని రైతుల భూములను, ప్రభుత్వానికి అవసరం లేని భూములను తిరిగి ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. 

ఎపి శాశ్వత హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అదే ఆలోచనను జగన్ చేస్తున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను ఎత్తివేస్తామని, దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తామని వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈ హామీని బిజెపి కూడా ఇచ్చింది. 

పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి లోకసభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని వైసిపితో పాటు బిజెపి కూడా చెప్పింది. ఈ స్థితిలో ప్రధాని మోడీని, అమిత్ షాను సంప్రదించిన తర్వాతనే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారు. దానిపై వివాదం చెలరేగుతోంది. 

అమరావతిని మరో ప్రాంతానికి తరలిస్తారనే ప్రచారం ఊపందుకోగానే వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఎపి రాజధానిని తిరుపతిలో పెట్టాలని కాంగ్రెసు నాయకుడు చింతా మోహన్ కోరారు. కర్నూలులో రాజధాని ఉండాలని వైసిపి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏమైనా, ఎపి రాజధానిపై చర్చ ముమ్మరంగానే సాగుతోంది.