అమరావతి: పోలీసు వలయాన్ని ఛేదించుకుని అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం అమరావతి రైతులు చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.సచివాలయాన్ని రైతులు నాలుగు వైపులా దిగ్బంధించారు. తుళ్లూరు వైపు నుంచి పంట పొలాల్లోంచి.. సచివాలయ వెనుక గేటుకు రైతులు చేరుకున్నారు. మందడం, మల్కాపురం వైపు నుంచి సచివాలయం ముందు గేటుకు చేరుకున్నారు. 

శాఖమురు, ఐనవోలు,గ్రామాల నుండి సచివాలయం కుడిపక్క గేట్ వైపు వచ్చారు. సచివాలయ ముట్టడిని అడ్డుకోలేక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సచివాలయం వెనుక వైపు నుంచి వచ్చి రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకి అనుమతి లేదంటూ పోలీసులు లాఠీచార్జీకి దిగారు. ఈ లాఠీ ఛార్జిలో  శంకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి సృహ తప్పి పడిపోయాడు. లాఠీ చార్జీలో అతని కాలు కూడా విరిగింది.

పోలీసులను ఛేదించుకుని అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దకు అమరావతి రైతులు చేరుకున్నారు. దాంతో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చోటు చేసుకుంది. రైతులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి లోని సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులను ఛేదించుకుని రైతులు, మహిళలు సచివాలయం మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. నలువైపుల నుంచి సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. 

జాతీయ జెండాలను చేతబట్టి ముందుకు వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. సేవ్ అమరావతి అంటూ వారు నినదిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంతే కాదు సచివాలయం పక్కనే ఉన్న చెరువు లోకి దిగి నినాదాలు చేస్తున్నారు.