న్యూఢిల్లీ: తెలుగింటి మహిళ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎంతో సంతోషాన్ని కల్గించిందని సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత ఒక మహిళ కేంద్ర ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఇది చాలా మంచి పరిణామమన్నారు. 

కేంద్ర బడ్జెట్ తనను సంతృప్తిపరచిందని నవనీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. మహిళలకు ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాన్యుడికి ఉపయోగపడేలా బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అభిప్రాయపడ్డారు. 

చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు నారీ టు నారాయణ అన్నట్లుగా ఉందన్నారు. తనకు మాత్రం తమిళనాడులో పుట్టి తెలుగు ఇంటి కోడలు అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక మహిళగా తాను ఎంతో సంతోషిస్తున్నట్లు ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.