అమరావతి: మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు  ప్రారంభించిన ఉద్యమానికి ఇవాళ్టితో ఏడాది పూర్తైంది. తమ ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని రైతులు అమరావతిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 

అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని రాయపూడిలోని పెట్రోల్ బంక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాయపూడిలోని బహిరంగసభ వేదిక వద్దకు అమరావతి రైతులు ర్యాలీగా  చేరుకొన్నారు. ఈ సభకు విపక్షాలు తమ మద్దతును ప్రకటించాయి.

ఈ సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. మరో వైపు ఈ సభకు వెళ్లకుండా జిల్లాలోని టీడీపీ నేతలను ఎక్కడికక్కడే  హౌస్ అరెస్టులు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

రాయపూడి వద్ద నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు పలు పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాల రైతులు  ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

రైతుల ఆందోళనలకు మద్దతుగా నిర్వహించే సభలో విపక్ష పార్టీలకు చెందిన పలు పార్టీల అగ్రనేతలు ఈ సభలో పాల్గొంటారు.