అమరావతిలో ఉద్రిక్తత: 'తెలంగాణ తరహాలో ఉద్యమం, చంపిన తర్వాతే మార్చండి'
అమరావతి పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మూడు రాజధానుల ఆలోచనను వెనక్కు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అమరావతి: ఏపీ సచివాలయానికి వెళ్లే రహదారిపై మందడం గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజదానులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాజధాని పరిసర గ్రామాలకు చెందిన 29 గ్రామాల రైతులు, ప్రజలు బంద్ పాటిస్తున్నారు.
Also read:ఏపీకి మూడు రాజధానులు: 29 గ్రామాల్లో బంద్ నిర్వహిస్తున్న రైతులు
29 గ్రామాలకు చెందిన రైతులు రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఏపీకి మూడు రాజదానులు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ ప్రకటనపై అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఇవాళ 29 గ్రామాలకు చెందిన రైతులు బంద్ పాటిస్తున్నారు. సచివాలయానికి వెళ్లే దారిపై రైతులు బైఠాయించారు.దీంతో సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
సచివాలయానికి వెళ్లే ఉద్యోగులను ప్రత్యామ్నాయమార్గాల ద్వారా పోలీసులు మళ్లిస్తున్నారు. ఏపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారా అని రైతులు ప్రశ్నించారు.ఈ విషయమై తాము స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసేందుకు ప్రయత్నిస్తే తమను పోలీస్‌స్టేషన్‌లో వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాజధానిని ఇక్కడి నుండి తరలించాలంటే తమను చంపేసి మూడు కాదు పది రాజధానులనుఏర్పాటు చేయాలని మందడం గ్రామానికి చెందిన రైతులు అభిప్రాయపడుతున్నారు.ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, సీఎం గంటకో మాట మాట్లాడుతున్నారని రైతులు చెప్పారు.
సీఎం జగన్‌తో పాటు మంత్రులను కూడ తాము సచివాలయానికి రాకుండా అడ్డుకోవడానికి కూడ సిద్దమని రైతులు ప్రకటించారు. మరో వైపు ఈ ఉద్యమాన్ని ఈ ఒక్క రోజుతో ఆపబోమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే తాము కూడ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేశారు.
మరో వైపు మంగళగిరిలో రైతులు పురుగుల మందుల డబ్బాలు పట్టుకొని నిరసనకు దిగారు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.