అమరావతి: ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాలకు చెందిన రైతులు బంద్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు చేయాలని ఉండొచ్చని సీఎం ప్రకటనపై రైతులు ఆందోళనగా ఉన్నారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ... ఆందోళనలు తీవ్రం చేయాలని ఆ ప్రాంత ప్రజానీకం నిర్ణయించింది. 

 తుళ్లూరు గ్రామంలో రోడ్డు పై గురువారం నాడు రైతులు బైఠాయించారు.  అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెంలో అన్నదాతలు, రైతు కూలీలు సమావేశమై చర్చించారు. గురువారం నాడు 29 గ్రామాల్లో బంద్ చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఇవాళ అమరావతి ప్రాంత బంద్‌కు పిలుపునిచ్చారు.సచివాలయం ఉన్న వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. అమరావతి కోసం పోరు సాగిస్తామని రైతులు చెబుతున్నారు.
రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకూ వెనకాడబోమని హెచ్చరించారు. 

ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతాన్ని మార్చడం అంటే ఆయన్ను అవమానించడమేనని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే... 3 రాజధానులు ఏర్పాటు చేయడమా అని ప్రశ్నించారు.రాజధాని బంద్‌ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్, 34 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నాయని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

29 గ్రామాల్లో రాజధాని అంశం పై జరుగుతున్న కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని  పోలీసులు నిరసనకారులకు  సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు పోలీసులు తీసుకుంటారని హెచ్చరించారు.