టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానిక వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానాలు నచ్చి ఏ పార్టీ ఎవరొచ్చినా తాము ఆహ్వానిస్తామని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.

చీరాలలో తానే కొనసాగుతానని, రాజకీయంగా ఎలాంటి మార్పులు ఉండవని జగన్ తనతో చెప్పినట్లుగా ఆమంచి వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు నేతలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి చేర్చుకున్నారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీ మూత పడుతుందని.. అందుకే అక్కడి వారంతా వైసీపీలోకి వస్తున్నారని కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.

Also Read:పార్టీ ఏం చేసిందో గుర్తు చేసుకోండి: జగన్‌తో కరణం భేటీపై చంద్రబాబు స్పందన

గత చేరికలకు, ప్రస్తుత చేరికలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆనాడు టీడీపీలోకి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, ఒక్కొక్కరికి 100 సార్లు ఫోన్లు చేయడమే కాకుండా కొంతమంది కాళ్లు, చేతులు కూడా పట్టుకున్నారని ఆయన ఆరోపించారు.

రూ.4 కోట్ల రూపాయల నుంచి రూ.40 కోట్ల దాకా చాలా మందికి డబ్బులు ఇచ్చారని కృష్ణమోహన్ చెప్పారు. అయితే ప్రస్తుతం టీడీపీ నాయకులు వాళ్లంతట వాళ్లే తమను బతిమాలుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆమంచి వెల్లడించారు.

Also Read:ప్రకాశంలో బాబుకు గట్టి ఎదురు దెబ్బ: వైసీపీలోకి కరణం బలరాం..?

తాము ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదని, కొత్త నేతలతో వివాదాలు లేకుండా కలుపుకుని ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.