కాకినాడ: ఆంధ్రాఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్మే స్థితిలో ఏపీ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 

లగడపాటి పరిస్థితి జూలకటక అన్నట్లుగా తయారయ్యిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తోందంటూ ఆయన ఇచ్చిన సర్వే బూటకపు సర్వే అంటూ ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో లగడపాటి జోకర్‌ అయ్యాడని విమర్శించారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్‌ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్‌ వ్యాపారం మొదలు పెట్టారని అందులో భాగంగానే ఈ సర్వేలు అంటూ ఆరోపించారు. 

లగడపాటి సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు ఫలితాల అనంతరం వెంటపడి మరీ తరుముతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి ఏపీ నుంచే పారిపోతారని చెప్పుకొచ్చారు ఎంపీ పండుల రవీంద్రబాబు.