అంబటి వ్యాఖ్య: చంద్రబాబుకు సెగ పెట్టిన మురళీమోహన్

Amabati Ramababu alleges Chandrababu is playing caste politics
Highlights

వేంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరిగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్య చంద్రబాబుకు సెగ పెట్టింది.

విజయవాడ: వేంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరిగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్య చంద్రబాబుకు సెగ పెట్టింది. మురళీమోహన్ వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కులం‌ పేరుతో అందరినీ విభజిస్తున్నారని ఆరోపిస్తూ చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు.

అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఏపీ చంద్రబాబుకే అలవాటేనని, 46 ఉప ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో  అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు.  

కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారని, టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోందని అన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకే 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో, 2009లో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌లతో, తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నిజం కాదా ్ని అడిగారు. 

అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి కావాల్సిందేనని, చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారని అన్నారు.

జూన్‌ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, తన ప్రసంగాలతో ప్రజలకు సుత్తి కొట్టడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. అసలు రాజధానిలో ఏం నిర్మించారని, మీరు సాధించిన అభివృద్ధి ఏమిటని అడిగారు. 

ఇసుక, మట్టి, రాజధాని భూములను చంద్రబాబు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ కలిసి చౌక ధర దుకాణాలకు సరుకులు అందిస్తాయని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెబుతూ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో వాటాలు కలిగి వుందని అన్నారు.

loader