అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జనసేన పవన్ కల్యాణ్ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన అన్నారు. 

ప్రతిపక్షాలే రాజకీయం చేసి అమరావతికి తికమకపెడుతున్నాయని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజధాని పేరుతో టీడీపి భారీ అవినీతికి పాల్పడిందని, అయితే ఈ విషయంలో జనసేన పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. 

రాజధానిపై పవన్ కల్యాణ్ ఎన్ని వైఖరులు తీసుకుంటారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఇంకా టీడీపి భాగస్వామిగానే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తే పట్టుమని పది మంది రాలేదని ఆయన అన్నారు. 

చంద్రబాబు రాజధాని పేరుతో చేసిన అవినీతి బయటకు వస్తుందని ఆందోళన చెందుతున్నారని, టీడీపి అవినీతి త్వరలోనే బయటకు వస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, లోకేష్ ఇప్పుడు ఇసుక కోసం ధర్నా చేస్తే ప్రజలు ఏ మాత్రం నమ్మబోరని ఆయన అన్నారు.