Asianet News TeluguAsianet News Telugu

మళ్ళీ వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి..? కారణమదేనా?

ఇంఛార్జ్ మార్పుల్లో భాగంగా వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మంగలగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటివైపు చూస్తున్నారు. 

Alla Ramakrishna Reddy in YCP again..? What is the reason? - bsb
Author
First Published Feb 20, 2024, 12:28 PM IST

మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అప్పటివరకు ఉన్న పార్టీల నుంచి వేరే పార్టీలకు వెళ్లేవారు.. టికెట్ దక్కకా.. టికెట్ వస్తుందో, రాదో తెలియక ఆశలు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నవారు చాలామందే ఉన్నారు. ఇక అధికార వైసీపీలో మార్పులు, చేర్పులు.. అభ్యర్థుల జాబితాలు గందరగోళాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకుంటురన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

వైసీపీ మొదటి జాబితాలో మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ గా వేరే వ్యక్తిని నియమించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బైటికి వచ్చారు. ఆ తరువాత వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ లో చేరారు. అలా వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తొలి ఎమ్మెల్యేగా ఆయన పేరుతెచ్చుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరకముందే.. ఆయన తాను షర్మిల వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

మైలవరం టిడిపి టికెట్ ఎవరిది..? దేవినేని ఉమకు చంద్రబాబునుండి పిలుపు  

అయితే, కాంగ్రెస్ లో చేరిన తరువాత పరిస్థితి తాను అనుకున్నట్టుగా లేదట. అధికార పార్టీ నేతగా, మంగళగిరి ఎమ్మెల్యేగా అప్పటివరకున్న పలుకుబడి పోయి.. సొంత నియోజవర్గంలోనే ఇబ్బంది పడాల్సి వచ్చిందట. ప్రోటోకాల్ నుంచి అన్నీ వదిలిపెట్టాల్సి వచ్చిందట. మరోవైపు ఆళ్ల అనుచరుల్లో ఆత్మరక్షణ భయం పట్టుకుందట. దీంతో ఆయన మీద ఒత్తిడి పెరిగిందని సమాచారం.

ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో చర్చించారు. తిరిగి సొంతగూటికి చేరుకునేందుకే చర్చలు జరిగాయని... ఈ చర్చల్లో ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. ఇవ్వాళ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలవనున్నారు. 

ఇవన్నీ అనుకున్నట్టుగానే అయితే.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆర్కె పార్టీలో నుంచి వెళ్లిపోయిన తరువాత.. ఆర్కె స్థానంలో ఇంఛార్జ్ గా నియమించిన గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అనుకున్నంతగా ఆదరణ లేదట. దీంతో తిరిగి మంగళగిరి ఇంఛార్జ్ ను కూడా మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆర్కె సొంతగూటికి రావాలనుకుంటుండడంతో... జగన్ రిస్క్ తీసుకోకుండా ఆయనకే టికెట్ ఇచ్చినా, ఇవ్వొచ్చని కూడా వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios