అఖిల పక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలపై అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ చర్చించారు. వైఎస్సార్ సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి పద్మజారెడ్డి, టీడీపీ వర్ల రామయ్య, సీపీఐ నుంచి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలి, సీపీఎం నుంచి వైవీరావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్ఈసీ కోరారు. 

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్‌ఈసీ బయటకు పంపివేశారు. సమావేశంలో అడుగడుగునా ఎస్ఈసీ మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోకపోవడంతో విదిలేక ఆయన్ని సమావేశం నుంచి బయటకు పంపించారు.

బైటికి వచ్చిన వర్లరామయ్య, గతంలో ఉన్నట్లు ఎస్ఈసీ లేరంటే ఆరోపణలు చేశారు. ఎస్ఈసీతో భేటీ తరువాత వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్ఈసీకి సూచించామని పేర్కొన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని సూచించామన్నారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తన్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తున్న దాడుల్ని కంట్రోల్ చేయాలని ఎస్‌ఈసీని కోరామని చెప్పారు. 

రేణిగుంట ఎయిర్ పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్ఈసీనే కేసు నమోదు చేయాలని కోరామని నారాయణ మూర్తి తెలిపారు.