అలిపిరి ఘటన చంద్రబాబుకు శ్రీవారి వార్నింగ్

First Published 23, May 2018, 7:31 PM IST
Alipiri incident warning to Chandrababu: Ambati
Highlights

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గతంలో అలిపిరి వద్ద జరిగిన ఘటన దేవుడు తన వైఖరిని మార్చుకోమని చేసిన హెచ్చరిక అని, నేడు అదే దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రాంబాబు విమర్శించారు.

విజయవాడ: అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గతంలో అలిపిరి వద్ద జరిగిన ఘటన దేవుడు తన వైఖరిని మార్చుకోమని చేసిన హెచ్చరిక అని, నేడు అదే దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రాంబాబు విమర్శించారు. బెజవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు చేయించిన ఘనుడు చంద్రబాబు అని, ఏడుకొండల స్వామి విషయంలో చేస్తున్న దానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు..

రమణదీక్షితుల ఇంట్లో ఎవరి ఫొటోలు ఉన్నాయో చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నం చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రమణదీక్షితులు ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉందని, అందుకే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. తెలుగు దేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ  ఆయన ఆరోపించారు.  వెంకటేశ్వర స్వామిని దోచుకునే నీచపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళుతున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని అంబటి అన్నారు. పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా చేసుకున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్దమని అన్నారు. తిరుమల పోటులో తవ్వకాలపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు. 

జనాలను బలవంతంగా తోలుకు వచ్చి ధర్మపోరాట సభను నిర్వహించారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తిరుపతి, నెల్లూరు, అమరావతిలో ప్రధాని ప్రసంగాన్ని ఈ సభలో చూపించారని, మోడీ మోసాన్ని చూపించారని అంటూ మరి చంద్రబాబు ఈ మూడు చోట్ల మాట్లాడిన మాటలను చూపించకపోవడం ఎటువంటి ధర్మమని ప్రశ్నించారు. 

ప్రత్యేక ప్యాకేజీ పై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు అర్ధరాత్రి చేసిన ప్రకటనను ఎందుకు చూపించలేదని అడిగారు.ధర్మ పోరాటమంటే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తీసుకురావడమా అడిగారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ మిలాఖత్ అయ్యిందని చెప్పడం మరింత విడ్డూరమని అన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తానని చంద్రబాబు ఎలా చెబుతున్నారని రాంబాబు అన్నారు. 

loader