విశాఖపట్నం: సినీ నటుడు అలీ రాజకీయ క్రీడ ఏమిటో అర్థం కావడం లేదు. వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తాజాగా మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ అయ్యారు. 

ఆయన గుంటూరు సీటును ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సీటును తనకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలో చేరుతానని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెప్పినట్లు సమాచారం. అయితే, చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు గానీ ఆయన తాజాగా గంటా శ్రీనివాస రావును కలిశారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోనూ, వైసీపీ అధినేత జగన్‌తోనూ అలీ ఇంతకు ముందు భేటీ అయ్యారు. గుంటూరు శాసనసభ స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన వారిని కూడా కోరి చివరకు చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. చివరకు ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.