గుంటూరు: మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడని మాజీమంత్రి కె.ఎస్ జవహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచిన జగన్ పేదల రక్తం త్రాగుతున్నాడని అన్నారు. అమాంతం ధరలు పెంచడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

''మద్యానికి అలవాటుపడిన వారు దాన్ని మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేదింపులకు గురిచేస్తున్నారు. మరికొంత మంది శానిటైజర్ త్రాగి చనిపోతున్నారు. ఇలా విజయవాడలో ఇవాళ ఇద్దరు శానిటైజర్ త్రాగి చనిపోయారు. మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా త్రాగి సుమారు 50 మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే,  దీనికి ప్రభుత్వం భాద్యత వహించాలి'' అని డిమాండ్ చేశారు. 

''పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయి. రాష్ర్టంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాపియాను పెంచి పోషిస్తున్నారు, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ద్యాస తప్ప మద్యపాన నిషేదం చేయాలన్న చిత్తశుద్ది లేదని ప్రజలకు అర్దమైంది'' అని మాజీ మంత్రి పేర్కొన్నారు.