Asianet News TeluguAsianet News Telugu

వైసిపి పాలనపై బుక్ కాదు... గ్రంధాలు విడుదల చేయాలేమో?: మాజీ మంత్రి ఆలపాటి

కేవలం రెండేళ్లలోనే వైసీపీ నాయకులు నింగి నుంచి నేల వరకు దోచేశారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. 

alapati rajendraprasad satires on ycp two years governance akp
Author
Guntur, First Published May 30, 2021, 1:32 PM IST

గుంటూరు: ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించారని వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలదీశారు. తప్పుడు, అబద్దపు ప్రచారాలతో మోసం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని... బ్లూ మీడియాను అడ్డం పెట్టుకొని అసత్య ప్రకటనలతో మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మభ్య పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

''ప్రజలకు అది చేశాం, ఇది చేశామంటూ పుస్తకాలు అచ్చు వేయిస్తున్నారు. మరి ప్రజల నుంచి దోచింది, వృధా చేసింది అచ్చు వేయటానికి గ్రంధాలు సరిపోతాయా? అన్న అనుమానం ప్రజల్లో కలుగుతుంది'' అంటూ ఎద్దేవా  చేశారు. 

''జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ 6 లక్షల కోట్ల స్కాం చేసేందని అబద్దపు పుస్తకాలు అచ్చు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం 6 రూపాయల అవినీతిని కూడా పట్టుకోలేకపోయారు'' అని మండిపడ్డారు. 

read more  ప్యాంటు తడిసిపోతే ఎలాగన్న విజయసాయి... రామ్మోహన్ నాయుడు ఘూటు రిప్తై

''కేవలం రెండేళ్లలోనే వైసీపీ నాయకులు నింగి నుంచి నేల వరకు దోచేశారు. రూ.1,500 వచ్చే ట్రాక్టర్ ఇసుకను రూ.5వేలకు పెంచేశారు. మద్యం రేట్లు మూడు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు. వాహనాల జరిమానాను 10 రెట్లు పెంచారు. నిత్యావసర ధరలు, పెట్రోల్-డీజీల్ ధరలను ఆకాశాన్నంటాయి. విద్యుత్ ధరలు, ఆర్టీసీ, పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారు. సెంటు పట్టా పేరుతో భూములు దోచుకున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు స్కీంల కోసం స్కాంలు చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''కేవలం రంగులు వేయడానికే రూ.3వేల కోట్ల ప్రజా ధనం వృధా చేశారు. పత్రికా ప్రకటనల పేరుతో రూ.400 కోట్లు, అందులో బ్లూ మీడియాకు రూ.250 కోట్లకు పైనే దోచిపెట్టారు. దాదాపు 35 మందికి పైగా సలహాదారుల కోసం వందల కోట్ల వ్యయం, వైసీపీ కార్యకర్తలకు వాలెంటీర్ల పేరుతో వేల కోట్లు, ప్రజా ప్రయోజనం లేని ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రజాధనం విచ్చల విడిగా వృధా చేస్తున్నారు'' అన్నారు. 

''ప్రజావేదిక కూల్చివేతతో దుష్టపాలనకు శ్రీకారం చుట్టారు. మూడు రాజధానుల పేరుతో అమరాతిని అటకెక్కించారు. అన్న క్యాంటీన్లను రద్దు చేశారు అవే ఉంటే కరోనా సమయంలో పేదలకు మరింత సాయంగా నిలిచేవి'' అని పేర్కొన్నారు. 

''ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడుల కోసమే అధికార యంత్రాంగమంతా పని చేస్తుంది. రెండేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, మహిళలకు చేసిన సంక్షేమం కంటే జరిగిన అన్యాయం, దోపిడీయే పదింతలుంది. ఇక దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అక్రమాలకు కొదవేలేదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదం పెరిగిపోయింది.  రెండేళ్లల్లో జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా? ఆస్తులు అమ్మటం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్పా జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ప్రజలకు ఇప్పటికే అర్ధమయ్యింది'' అని మాజీ మంత్రి ఆలపాటి విరుచుకుపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios