Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర విభజనకు కారకుడు.. ఆంధ్రుల ఓట్లు కావాలా, ఏపీలో అడ్డుకుంటాం: కేసీఆర్‌కు ఆకుల శ్రీనివాస్ హెచ్చరిక

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు సీనియర్ రాజకీయవేత్త ఆకుల శ్రీనివాస్. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తామంటే సహించేది లేదన్నారు 

akula srinivas fires on telangana cm kcr's brs party ready for contesting in ap
Author
First Published Oct 6, 2022, 9:48 PM IST

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ నేతలతో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైసీపీ తదితర పార్టీ నేతలు తమదైన వాదన వినిపిస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త ఆకుల శ్రీనివాస్ స్పందించారు. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తామంటే సహించేది లేదని... ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఆంధ్రా వారిపై విద్వేషాన్నిరెచ్చగొట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ, తెలంగాణలుగా విడదీసిన కేసిఆర్ ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు అడగడానికి వస్తారని శ్రీనివాస్ విమర్శించారు . 

దేశంలోనే మొట్ట మొదటి బాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఆంధ్ర రాష్ట్రం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిందనీ శ్రీ బాగ్ ఒడంబడికని అనుసరించి అప్పుడు కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నామని శ్రీనివాస్ గుర్తుచేశారు. తెలుగు మాట్లాడే వారంతా కలసి ఉండాలనే లక్ష్యంతో 1956 నవంబర్ 1 తేదీన స్టేట్ ఆఫ్ హైదరాబాద్‌ని కలుపుకుని ఆంద్రప్రదేశ్‌గా అవతరించిందనీ ఆయన పేర్కొన్నారు. అయితే 58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2014 లోకి అమల్లోకి తీసుకోచ్చారని, 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా విడిపోయాయని శ్రీనివాస్ వెల్లడించారు. 

ALso REad:ఆషామాషీగా జాతీయ పార్టీ పెట్టలేదు.. సీఎంగానే దేశమంతా తిరుగుతా, మహారాష్ట్ర నుంచే మొదలు : కేసీఆర్

తెలంగాణ ఉద్యమం ఆంధ్రులకు వ్యతిరేకంగా, ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా పుట్టిందనీ ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కె.సి. ఆర్ ఆంధ్రులను , ఆంధ్రా ఉద్యోగులను అనిరాని మాటలు అన్నారనీ ఆకుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి మంత్రి  హరీశ్ రావు ఢిల్లీలో ఉన్న ఏ.పి.భవన్‌కి వెళ్లి ఉద్యోగులను తిట్టడమే కాకుండా వాళ్ళను కొట్టి దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రులు అవన్నీ మర్చిపోయి హైదరాబాద్‌లో టిఆర్ఎస్‌కు అండగా ఉంటూ అనేక ఎన్నికల్లో మద్దతుగా నిలిచారనీ శ్రీనివాస్ వెల్లడించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే ఆంధ్రులకు ఇక్కడ పార్టీ పెట్టడానికి సిగ్గుండాలని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారని ఆయన మండిపడ్డారు. 

ఏ. పి లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  విప్లవాత్మక మైన మార్పులు తెచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నారని కొనియాడారు. ఇక్కడ రోడ్లు బాగోలేవని , ఉద్యోగులకు జీతాలు లేవని, కరెంట్ సరిగ్గా ఇవ్వట్లేదని టి. ఆర్. ఎస్ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీశైలం జలాలు సముద్రం పాలు అవుతున్నా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతూ పోలవరం ప్రాజెక్ట్ పై అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారనీ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కెసిఆర్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టి. ఆర్.ఎస్‌ను బీ.ఆర్.ఎస్‌గా మార్చారని శ్రీనివాస్ ఆరోపించారు. కె.సి.ఆర్.వల్ల రాష్ట్ర విభజన జరిగి ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతుంటే ,విభజన చట్టంలో తెలంగాణ నుండి ఆంద్రప్రదేశ్ కి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిల్ని ఇంతవరకు చెల్లించని చంద్రశేఖర్ రావు ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో రాజకీయ పర్యటన కోసం కేసీఆర్ ఎక్కడకి వచ్చినా అడ్డుకొంటామని ఆకుల శ్రీనివాస్ హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios