కర్నూలు: ప్రత్యేక హోదా కోసం కొందరు దొంగలు దీక్షలు చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పార్టీ టీడీపి మాత్రమేనని అన్నారు. 

రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్నారు. మహిళలకు అండగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. రెండు రోజుల పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశానికి గైర్హాజరైన అఖిల ప్రియ గురువారం కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు. 

తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు గురువారంనాడు ఓర్వకల్లు గుట్టపాడు సమీపంలో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. రూ. 3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ప్రారంభమవుతుంది. దీనివల్ల 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఉర్దూ, రూసా క్లస్టర్ విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. 

సెప్టెంబర్ నెలలో ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభమవుతుందని చంద్రబాబు చెప్పారు. ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తాయని అన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.