అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా  భారీగా నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నెలలో కురిసిన భారీ వర్షాలతో  రాష్ట్రంలోని 186 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేశారు. ప్రాథమిక అంచనాలను అధికారులు తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదికను అందించారు.

వరదల కారణంగా 885 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి.పలు శాఖలకు నష్టం అంచనాలను అధికారులు తయారు చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 50 లక్షలు, మౌళిక సదుపాయాల కోసం రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది.

 రోడ్లు భవనాల శాఖకు రూ. 1300 కోట్లు, ఏపీ ఇరిగేషన్ కు రూ. 33 కోట్లు,మున్సిపల్ శాఖకు రూ. 22 కోట్లు,పంచాయితీరాజ్ శాఖకు రూ. 160 కోట్లు,విద్యుత్ శాఖకు రూ. 5 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు.

2.38  లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కలు  తేల్చారు.విశాఖ, కృష్ణా, కర్నూల్ జిల్లాలో సుమారుగా రూ. 141.56 కోట్ల పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం తేలింది.33,500 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

వర్షాల కారణంగా 1700 ఇళ్లు ధ్వంసమయ్యాయని తేల్చారు.ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలకు  అక్వా కల్చర్ భారీగా దెబ్బతిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 7400 ఎకరాల్లో అక్వా కల్చర్ కు తీరని నష్టం వాటిల్లినట్టుగా అధికారులు ఈ నివేదికలో తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం త్వరలోనే రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.ఇటీవలనే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందం వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా జీహెచ్ఎంసీలలో వరద నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది.