Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మణి ఎందుకు ఆగింది: తిలా పాపం తలా పిడికెడు

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు

Agitation for steel factory in Kadapa district

కడప:కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు ఊపందుకొంటున్నాయి.  అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతుండగా టిడిపి ఎంపీ సీఎం రమేష్ జూన్ 24వ తేదిన ఆమరణ నిరహర దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. గతంలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. విభజన హమీలో పొందుపర్చినట్టుగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై  కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. అయితే కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేస్తామని బిజెపి నేతలు ప్రకటిస్తున్నారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో  బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై  అప్పటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది.2007 మే మాసంలో ఓఎంసి కంపెనీతో అప్పటి  వైఎస్ సర్కార్ ఒప్పందం చేసుకొంది. అయితే 2009 డిసెంబర్ నాటికి తొలిదశ ప్రాజెక్టును రూ.4500 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఒప్పందం మేరకు 2007 జూన్ మాసంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జమ్మలమడుగు నియోజకవర్గంలో సుమారు 10 వేల 670 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఎకరానికి రూ.18,500 చొప్పున విక్రయించారు. సుమారు 10 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధితో పాటు లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని ప్రతిపాదించారు.

కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డియే బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు.  అయితే నిర్ణీత సమయంలో తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. బ్రహ్మణిస్టీల్ ఫ్యాక్టరీకి అనుమతులు రాకముందే ఓబులాపురం మైనింగ్ ను గాలి జనార్ధన్ రెడ్డికి కట్టబెట్టారని ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పటి వైఎస్ ప్రభుత్వం మైలవరం, గండికోట రిజర్వాయర్ల నుండి 2 టిఎంసిల నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే  ఓబులాపురం మైనింగ్ పై ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.

2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఓబులాపురం మైనింగ్ లో అక్రమాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్ళాడు.అయితే 2009 తర్వాత బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ పనులను ఆ సంస్థ పూర్తిగా నిలిపివేసింది.

బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టిన గాలిజనార్ధన్ రెడ్డి రూ.350 కోట్లు ఆ సమయంలో అప్పుగా తీసుకొన్నాడని సీబీఐ గుర్తించింది. 2009లోనే తొలి దశ పనులు పూర్తి కావాల్సి ఉండగా కనీసం 5వ వంతు పనులు కూడ పూర్తి కాలేదు. 2009 తర్వాత పనులను పూర్తిగా నిలిపివేశారు.

దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. 2012 మే 31 ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. అయితే ఈ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 10,760 ఎకరాల భూమిని మాత్రం 2013 ఏప్రిల్ 25వ తేదిన వెనక్కి తీసుకొంటున్న అప్పటి ప్రభుత్వం జివో జారీ చేసింది.

ఏటా రెండు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తూ 2017 నాటికి 10 మిలియన్ టన్ను ఉక్కు ఉత్పత్తి చేయాలని బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ లక్ష్యంగా ఉండేది. అయితే ఆనాడు ఆ ప్యాక్టరీ ప్రారంభమైతే కడప జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు లేకపోలేదనే వారు కూడ లేకపోలేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ,ఏపీ రాష్ట్రాలుగా 2014లో విభజించారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు విభజన హమీలను ఇచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణకు బయ్యారంలో, ఏపీకి కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చింది.కానీ వీటిపై కేంద్రం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

బయ్యారంలో దొరికే ఇనుప ఖనిజం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నాణ్యత లేదని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. అయితే ఫ్యాక్టరీపై సాధ్యాసాధ్యాలను టాస్క్ ఫోర్స్ కమిటి పరిశీలిస్తోంది. ఏపీకి ఇచ్చిన హమీల్లో ప్రధానమైన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై కూడ కేంద్రం నుండి స్పష్టత రాలేదని ఏపీ సీఎం సహ పలువురు టిడిపి నేతలు చెబుతున్నారు. 

అయితే విభజన హమీలను అమలు చేసేందుకు తాము సిద్దమేనని బిజెపి నేతలు ప్రకటిస్తున్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలిస్తోందని కేంద్రం తాజాగా ప్రకటించింది.

కేంద్రం చేసిన ప్రకటన పట్ల టిడిపితో సహ ఇతర పార్టీలు కూడ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కడపలో  అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు టిడిపి నేత సీఎం రమేష్ జూన్ 24వ తేదిన ఆమరణ దీక్షకు కూడ సిద్దమయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios