ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానిక చేరకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి డైరెక్ట్ గా పవన్ విజయవాడలోని తన నివాసానికి చేరకున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘెర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై పవన్ తన పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ముఖ్య నేతలతో.. తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల్లోని నేతలతో ఆయన సమీక్ష జరపనున్నారు. ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజోలు నుంచి జనసేన తరఫున రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు.
 
ఇక నుంచి పవన్ కల్యాణ్ ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో.. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పవన్ నిర్ణయించారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లాల వారీగా సమీక్షలు చేసిన పవన్ ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీని అన్నీ తానై నడిపించారు. ఇక నుంచి జిల్లాల వారీగా నాయకత్వాన్ని బలోపేతం చేసి ఆయా ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలతో ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. ఇందుకోసం గ్రామీణ ప్రజలను ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది.