ఆంధ్రప్రదేశ్‌కు నూతన జిల్లాల ఏర్పాటు ఎలా జరుగుతుందో.. మూడు రాజధానులు ఏర్పాటు కూడా అలానే జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మకమని అన్నారు. జిల్లాలను విభజించడం వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మూడు రాజధానుల విషయం మళ్లీ తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకూ ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్వపక్షం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న.. విపక్షలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నాయి.
అయితే..ఈ నూతన జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎలా 26 జిల్లాలు వస్తున్నాయో, అదే తరహాలో మూడు రాజధానులూ వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు మరింత చేరువ కానున్నాయన్నారు.
26 జిల్లాలు ఏర్పడిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను దారి మళ్లించేందుకే కొత్త జిల్లాలపై ప్రకటన చేశామని చెప్పడం సరికాదని, జిల్లాల పునర్విభజన చరిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని అన్నారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారని, చర్చల ద్వారా పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. భీమిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. కృష్ణ జిల్లాకు ఎన్‌టీ రామారావు పేరు పెట్టడాన్ని స్వాగతించారు.
ప్రముఖుల పేర్లతో జిల్లాల పేర్లను మార్చడంపై టీడీపీ చేసిన వ్యాఖ్యలపై అవంతి స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. ఉదాత్త ఉద్దేశ్యంతో కృష్ణ జిల్లాకు ఎన్‌టీ రామారావు పేరు పెట్టామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాల వ్యవహర తీరును ప్రశ్నించారు.
జిల్లాల ఏర్పాటుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను తెరపైకి తేవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని, ప్రతిపక్ష బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని పేర్కొన్నారు. ఒక్క చంద్రబాబు తప్పా అంతా అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని భావించడం సరికాదన్నారు. కొత్త పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు తన కుటుంబ సభ్యుల లాంటివారని అన్నారు. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
