చంద్రబాబు కోసం రంగంలోకి సిద్ధార్థ లూథ్రా.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు రోడ్డుమార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. కొద్దిసేపట్లో చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. విజయవాడ చేరుకున్న అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం సిద్దార్థ లూథ్రా ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమర్పించిన ఆధారాలు, ఇరువైపుల వాదనల అనంతరం.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే, చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్కడికి చేరుకున్న టీడీపీ మహిళా కార్యకర్తలు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.