అమరావతి: గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాను నిర్వహించబోయే కేబినెట్ భేటీకి ఏ అధికారి హాజరుకారో చూస్తానంటూ చంద్రబాబు హెచ్చరించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపింది. 

ఈసీ, సీఎస్ టార్గెట్ గా నానా తిట్లు తిట్టిపోసింది టీడీపీ. అయితే ఎట్టకేలకు సిఈసీ అనుమతి ఇవ్వడంతో మంగళవారం మధ్యాహ్నాం అమరావతి సెక్రటేరియట్ లో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ సుదీర్ఘ చర్చ జరిగింది. 

ఫొని తుఫాన్, కరువు, తాగునీరు-సాగునీరు, ఉపాధి హామీ పథకం అమలుపై చర్చ జరిగింది. ఆయాశాఖల అధికారులతో చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఫొని తుఫాన్ సమయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఎంతో ఉపయోగపడిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

తాను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం మన రాష్ట్రంతోపాటు ఒడిస్సా రాష్ట్రానికి కూడా ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు. ఫొని తుఫాన్ సమయంలో అద్భుతంగా పనిచేశారంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు అధికారులను చంద్రబాబు అభినందించారు. 

ఈ సమయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి జోక్యం చేసుకుని చంద్రబాబుపై పంచ్ లు వేశారు. తిత్లీ, ఫొని తుఫాన్ ల గురిచి ముందే చెప్పిన ఆర్టీజీఎస్ బాబు ఏపీ ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా అంటూ కోరారు. 

దీంతో ఏపీ కేబినెట్ లో నవ్వులు వెదజల్లాయి. సమావేశం అంతా నవ్వులు పూశాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డికి సైతం చంద్రబాబు నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్ల సునామీ నీ చెవిలో చెప్తా అంటూ చెప్పడంతో మళ్లీ నవ్వులు వెలిశాయి.