విశాఖపట్నం: టాలీవుడ్ లో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. నటించడమే కాదు డైరెక్ట్ చెయ్యడమూ ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. 16 ఏళ్లకే సినీనటిగా ప్రస్థానం మెుదలుపెట్టిన ఆమె ఏకంగా 23 ఏళ్లలో 400 సినిమాలలో నటించి మెప్పించారు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 

తాను పెరిగిన వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఒక గిరిజన యువతి సమస్యలను ప్రపంచానికి చాటిచెప్తూ తీసిన ఓ మల్లీ..చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకుంది. నటనతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టడంలోనూ ఆమెకు ఆమె సాటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

రమ్య హృదయాలయ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేదలకు ఆపన్నహస్తం అందించింది. ఆమె సేవలను గుర్తించిన కాలిఫోర్నియాలోని నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 

అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ నుంచి అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు జాతీయ మదర్ థెరిస్సా అనే అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. 

సినీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉండే రమ్యశ్రీ రాజకీయాల్లోనూ అంతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె అలుపెరగని ప్రచారం చేశారు. 

తన సొంత జిల్లా అయిన విశాఖపట్నంలో దుమ్ముధులిపేశారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ప్రజల మధ్యనే గడిపారు రమ్యశ్రీ. 

ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకోసం అన్నదమ్ములను సైతం వదులుకున్నారు రమ్యశ్రీ. తన అన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

మరోవైపు ఆమె తమ్ముడు గవిరెడ్డి సన్యాసిన నాయుడు సైతం అదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ వారిని పట్టించుకోలేదు రమ్యశ్రీ. అన్న గెలుపు కోసం కానీ, తమ్ముడు గెలుపు కోసం గానీ ఎలాంటి ప్రచారం చెయ్యలేదు. 

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆ పార్టీ కోసం పనిచేస్తానని సోదరుల ముఖం మీదే కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి రమ్యశ్రీకి విశాఖపట్నం జిల్లా కొట్టిన పిండిగా చెప్పుకోవాలి. రమ్య హృదయాలయ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చేరువయ్యారు. 

అంతేకాకుండా బీసీ సామాజిక వర్గం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఫలితంగా ఆమె విశాఖపట్నం జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకంటూ ఓ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతోందని పార్టీ భావించింది. 

సోదరులను సైతం పక్కన పెట్టి నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు సినీనటి రమ్యశ్రీ. మండుటెండలను సైతం లెక్కచెయ్యకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమాగా ఉన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా అన్నవారిని సైతం పక్కన పెట్టిన రమ్యశ్రీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గుర్తింపు ఇస్తుందోనన్న ఆసక్తికర చర్చ జోరుగా సాగుతోంది. మరి రమ్యశ్రీ లక్ ఎలా ఉందో అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందేనట.