అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి చెందిన మరో నటుడికి కీలక పదవి కట్టబెట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్వీబీసీ చైర్మన్ గా నటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డిని నియమించారు. 

తాజాగా టాలీవుడ్ కి చెందిన నటుడు శ్రీనివాస్ రెడ్డిని ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించారు సీఎం జగన్. ఖమ్మం జిల్లాలో జన్మించిన శ్రీనివాసరెడ్డి కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. అయితే ఇష్టం సినిమా నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు శ్రీనివాస్ రెడ్డి. 

ఇడియట్, వెంకీ, డార్లింగ్, గీతాంజలి వంటి సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఎదిగారు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో హీరోగా మారారు. 

ఎస్వీబీసీ డైరెక్టర్ గా జర్నలిస్ట్ స్వప్న
ఇకపోతే ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న సైతం ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. సాక్షి చానెల్ మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తించిన స్పప్న తరువాత కెరీర్ పరంగా ఎన్నో ప్రయోగాలను చేసిన సంగతి తెలిసిందే. మంచి ముహూర్తం చూసుకుని స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ సీనియర్ జర్నలిస్టులు అయిన దేవులపల్లి అమర్, సజ్జల రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ కొండు భట్ల రామచంద్రమూర్తిల‌ను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా స్వప్నకు కూడా అరుదైన అవకాశం కల్పించారు.