ప్రత్యేకహోదా సాధన సమతి నేత శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఆధారంగా శివాజీ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఏపీ టార్గెట్‌గా ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ప్రారంభించిందని ప్రత్యేక హోదా పోరాట సమితి నాయకుడు శివాజీ ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలతో ఓ వీడియో విడుదల చేశారు.

దీని ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీలోగా ఏపీ ప్రభుత్వాన్ని కూల్చుతారని జోస్యం చెప్పారు. బీహార్‌, ఒడిశా మనుషులతో ఏపీలో అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని, సోషల్‌మీడియాలో అధికార పార్టీపై దుష్ప్రచారం ఆపరేషన్‌లో భాగమేనని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. కొన్ని ఒత్తిళ్లతో కొత్త నాయకుడిని కేంద్రమంత్రిగా పంపేలా పథకం రూపొందించారని, ఓ జాతీయపార్టీ నేతను ఏపీకి సీఎం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని శివాజీ అనుమానం వ్యక్తం చేశారు.

ఓ ముఖ్యనాయకుడిపై దాడికి గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారని, ముఖ్యనేతపై ప్రాణహానీ లేకుండా దాడిచేయాలని ప్లాన్‌ చేశారని ఆయన చెప్పారు. జాతీయ పార్టీ అనుబంధ సంస్థలోని ఓ కీలక నేత తనకు ఈ విషయాలు చెప్పారని శివాజీ వివరించారు.