అమరావతి: ఆపరేషన్ గరుడ అంటూ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసిన సినీనటుడు శివాజీ రూట్ మార్చారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలనే టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగగా ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేశారు. 

ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబుపై కేసులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి ఘటనలను ముందే చెప్పి తెలుగునాట రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడుతున్నారు శివాజీ.  

కొంతమంది ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చఏశారు. 

 రైతులు విద్యుత్ సమస్యతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. భూ సమస్యలు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయన్న శివాజీ  చుక్కల భూములు, అసైన్డ్ భూములు పేదలకు పంచాలని 2007లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. 

కానీ ప్రస్తుత అధికారులు మాత్రం పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చుక్కలు భూములు, అసైన్డ్ భూములను పేదలకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నిషేధిత భూముల పేరుతో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. అధికారులే గందరగోళం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు. ఈనెలాఖరుకు సమస్య తేలకపోతే అధికారుల పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. 

నల్సార్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్లతో మాట్లాడి తాను ఈ సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు. ఏపీలో దాదాపుగా 12 లక్షల ఎకరాల చుక్కలు భూములున్నాయని 30 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని శివాజీ చెప్పుకొచ్చారు.